Sep 19,2023 21:24

ఇ-పంట నమోదును పరిశీలిస్తున్న ఎఒ అవినాష్‌

ప్రజాశక్తి - సీతానగరం : ఈనెల 30 వరకు ఇ-పంట నమోదు జరుగుతుందని మండల వ్యవసాయాధికారి ఎస్‌.అవినాష్‌ తెలిపారు. మంగళవారం చినబోగిలి, కాశీపేటలో ఇ-పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఇప్పటివరకు 72శాతం ఈ పంట నమోదైందని, అన్ని గ్రామాల్లోనూ వ్యవసాయ శాఖ సిబ్బంది ఇ- పంట నమోదు చేస్తామన్నారు. కౌలు రైతులు ఆర్‌బికె, వ్యవసాయ సిబ్బంది ద్వారా ఈ పంట నమోదు చేసుకోవాల న్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
రైతు పొలాల్లో శాస్త్రవేత్తలు క్షేత్ర సందర్శన
సీతంపేట : వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త ప్రధాన శాస్త్రవేత్త పి.సీతారాం శాస్త్రవేత్త సౌజన్య బృందంతో మంగళవారం సీతంపేట మండలంలో మల్లిదారి, మల్లి, కుసిమి, పాత్రుని గూడ గ్రామాల్లో ఉన్న పొలాలను సందర్శించారు. ప్రధానంగా ఆకు మడత, చిత్త పురుగు గమనించారు. దీని నివారణకు ఎపిపేట్‌, 1.5 లేదా నీమాస్త్రం 5, పిచికారీ చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. ఎరువులు యాజమాన్యం పద్ధతులు గురించి తెలియజేశారు. చీడపీడల అధ్యయనం చేసి పోషకాల లోపాలు గురించి రైతులకు తెలిపారు. భూసారం సేంద్రీయ వ్యవ సాయంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపిఇఒ గాయత్రి నాయుడు, రైతులు పాల్గొన్నారు.
పి.ఆమిటి లో వైయస్సార్‌ పొలంబడి
గుమ్మలక్ష్మీపురం : మండలం పి.ఆమిటిలో వైయస్సార్‌ పొలంబడి మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్‌ పి.షణ్ముఖరాజు మాట్లాడుతూ ప్రతి రైతు తాను పండించిన పంటను ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేసుకోవాలని, అటువంటి పంటలను జట్టు తోటపల్లి ఎఫ్‌పిఒ సంస్థ కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయంలో పండించిన పంటలకు మంచి మద్దతు ధర వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల పొలాలను పరిశీలించారు. రైతులకు తగు సూచనలు సలహాలు అందించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సిహెచ్‌.ప్రసాద్‌, పంచాయతీ సర్పంచ్‌ తాడంగి దమయంతి, వ్యవసాయ శాఖ సహాయకులు ఎన్‌.పావని, ఎన్‌ఎఫ్‌ఎ జి.అన్నపూర్ణ, ఎపి సిఎన్‌ఎఫ్‌ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.