Oct 27,2023 21:59

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ''ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని, దాని మద్దతుదారుల్ని ఓడించండి. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నిర్బంధ విధానాలపై పోరాడండి'' అనే నినాదంతో ప్రజలను చైతన్యపర్చేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ నుంచి రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి బస్సు జాతాలు ప్రారంభం కానున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌ వెల్లడించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలను కవర్‌ చేస్తూ మన్యం జిల్లాలోని పార్వతీపురం నుంచి ఒక జాత, శ్రీకాకుళం జిల్లా మంధస నుంచి రెండో జాత, రాయలసీమలోని కర్నూలు నుంచి మూడో జాత ప్రారంభం అవుతాయన్నారు. నవంబర్‌ 6న బస్సు జాత రాజమహేంద్రవరం నగరానికి చేరుకుంటుందని వివరించారు. ప్రజా రక్షణ భేరి పేరుతో సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యాత్ర ముగింపు సందర్భంగా విజయవాడలో నవంబర్‌ 15న భారీ బహిరంగ సభ జరుగుతుందని, దీనికి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, పోలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు తదితర నాయకులు హాజరవుతున్నారన్నారు. కేంద్రంలో మోఢి, రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తేవడమే లక్ష్యంగా ఈ జాతాలు సాగుతాయని తెలిపారు. మోఢి ఇచ్చిన ఏ హామీని నేరవేర్చలేదని, అంబానీ, ఆదానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెడుతూ పాలన మొత్తం కార్పొరేటీకరణ చేస్తున్నారని విమర్శంచారు. రాష్ట్రంలో జగన్‌ కూడా మోఢి ఏది అమలు చేయమంటే అదే అమలు చేస్తూ ప్రజల్ని కష్టాల పాలు చేస్తున్నారన్నారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం 30 అంశాలతో ప్రజా ప్రణాళికను విడుదల చేశామన్నారు. ప్రజా ప్రణాళికలో ముఖ్యంగా విద్యుత్‌ యూనిట్‌ రూపాయికే ఇవ్వడంతోపాటు, పేదలకు 300 యూనిట్లు ఉచితంగా సరఫరా చేయడంతోపాటు, స్మార్ట్‌మీటర్ల బిగింపు, ట్రూఅప్‌ ఛార్జీల రద్దు చేస్తామన్నారు. రూ.400కే గ్యాస్‌, రూ.60కే లీటర్‌ పెట్రోలు, డీజిల్‌, ఇసుక ఉచితం, ఒక్కొక్కరికి పదికేజీల ఉచిత బియ్యం, పప్పు నూనెల సరఫరా, నిత్యావసర ధరల తగ్గింపు, అందరికీ సంక్షేమం, పెన్షన్లు, రేషన్‌కార్డులు అన్నిరకాల పెన్షన్లు రూ.5 వేలు, పేద మహిళలకు ప్రత్యేక సాయం, రెండు సెంట్ల ఇల్లు, రూ.5 లక్షల ఆర్థికసాయం, నివాసిత ప్రాంతాల్లోనే ఇళ్లకు పట్టాలు, కొత్తకాలనీలకు అన్ని సౌకర్యాలు, చెత్తపన్ను, డ్రెయినేజీ ఛార్జీలు రద్దు, ఇంటిపన్ను తగ్గింపు, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ, అమరా వతిలోనే రాజధాని, 40 వేల టీచర్‌పోస్టులకు మెగా డిఎస్‌సి, 2.50 లక్షల ప్రభుత్వ ఖాళీలు భర్తీ, నిరుద్యోగభృతి నెలకు రూ.5 వేలు, ఒపిఎస్‌ పునరుద్ధరణ, ప్రయివేటు ఉపాధ్యాయులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పెన్షన్‌. భూమిలేని వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు రెండెకరాల భూమి, సేకరించిన భూముల్లో పరిశ్రమలు, లేదంటే రైతులకు వాపస్‌, అసలు పట్టాదారుకే అసైన్డ్‌ భూములపై హక్కులు, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు, గ్రామీణ ఉపాధి 200 రోజులు, రోజు వేతనం రూ.600. పట్టణ ఉపాధి గ్యారంటీ చట్టం, సమానపనికి సమాన వేతనం వంటివి తమ అమలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు బి.పవన్‌, జె.రాంబాబు, ఎస్‌ఎస్‌.మూర్తి, బి.రాజులోవ పాల్గొన్నారు.