Oct 25,2023 20:48

సమావేశంలో మాట్లాడుతున్న ఆనంద్‌ బాబు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ఈనెల 29న 'రాజ్యాంగం - మనువాదం' అనే అంశంపై ఎమ్మిగనూరులో జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ఆనంద్‌బాబు కోరారు. బుధవారం పట్టణంలోని శ్రీనివాస్‌ భవన్‌ వద్ద ఉన్న సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో మతోన్మాదాన్ని నెత్తికెత్తుకున్న పాలకుల కారణంగా రాజ్యాంగ హక్కులు అపహాస్యం అవుతున్నాయని తెలిపారు. రాజ్యాంగం స్థానంలో చాతుర్వర్ణాన్ని బలపరిచిన మనువాదాన్ని తిరిగి అమలుపరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజ్యాంగం కారణంగానే సమాజంలో ఉన్న అందరికీ సమాన హక్కులు లభిస్తున్నాయని తెలిపారు. కుల, మత, ప్రాంత, భాష చిచ్చు రాజేస్తూ పాలకులు చేస్తున్న తప్పునకు వ్యవస్థను కారణం చేస్తూ, మనుషుల మధ్య నిప్పు రాజేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ రక్షణ అన్నది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరీ బాధ్యత అని తెలిపారు. ఈనెల 29న ఎమ్మిగనూరులోని తేరుబజార్‌లో ఉన్న పద్మశాలి కమ్యూనిటీ హాలులో జిల్లా స్థాయి సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. సదస్సుకు దళిత్‌ సోషన్‌ ముక్తిమంచ్‌ జాతీయ ఉపాధ్యక్షులు, కెవిపిఎస్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు హాజరవుతున్నారని తెలిపారు. కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి.తిక్కప్ప, జిల్లా సహాయ కార్యదర్శి హెచ్‌.చిన్న మారయ్య, డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షులు లక్ష్మన్న, కెవిపిఎస్‌ మండల నాయకులు తాయన్న పాల్గొన్నారు. ఎమ్మిగనూరులోని కెవిపిఎస్‌ కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు దేవ సహాయం పాల్గొన్నారు.