Jul 14,2023 19:30

కరపత్రాలను విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - నందవరం
ఈనెల 28న చేపట్టే 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు కోరారు. శుక్రవారం నందవరంలో ఆర్‌ఎవిఎఫ్‌, రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు కృష్ణ, ఖాజా మాట్లాడారు. రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కృష్ణానదిపై సంగమేశ్వరం దగ్గర తీగల వంతెనకు బదులుగా బ్రిడ్జి కం బ్యారేజీని నిర్మించాలని కోరారు. కర్ణాటకలో అక్రమంగా నిర్మిస్తున్న 'అప్పర్‌ భద్ర' ప్రాజెక్టును నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితి ఉందన్నారు. ఆర్‌డిఎస్‌ను వెంటనే పూర్తి చేయాలని, కర్నూలులో కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఎల్‌ఎల్‌సి, హెచ్‌ఎల్‌సి కాలువలను స్థిరీకరించి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు ఉరుకుందు, హరికృష్ణ, రామలింగ, వీరబాబు, వెంకట్‌, వీరేష్‌ పాల్గొన్నారు.