27 నుంచి ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ స్పెషల్ క్యాంపులు : కలెక్టర్
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి స్కూల్ ఎడ్యుకేషన్, అనీమియా, గడప గడపకు మన ప్రభుత్వం, స్పందన, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు తదితర అంశాలపై అమరావతి సచివాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ కలెక్టరేట్ నుండి వీడియోకాన్ఫరెన్స్లో పాల్గొని జిల్లా ప్రగతి వివరించారు. అనంతరం కలక్టర్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సంబంధించి గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలలో అనీమియా నివారణకు, సుస్థిరాభివద్ధి లక్ష్యాల సాధనలో నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలన్నారు. బరువు తక్కువ పిల్లలు, ఎత్తు తక్కువ పిల్లల్లో ఆయా లోపాల నివారణకు వైయస్‌ఆర్ సంపూర్ణ పోషణ కింద అందిస్తున్న పోషకాహారం నూరు శాతం తీసుకునేలా చూడాలని, నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలన్నారు.జిల్లాలో డ్రాప్ వుట్స్ గుర్తించిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించుటకు, తద్వారా డ్రాపుట్స్ తగ్గించటానికి కృషి చేయాలన్నారు. నాడు-నేడు కింద జిల్లాలో రెండో దశలో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. ఆయా పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్స్ నిర్మాణాలు పూర్తి చేసిన వాటిని వినియోగంలోకి తేవాలన్నారు. సచివాలయంలోని వెల్ఫేర్, ఎడ్యుకేషన్, మహిళా పోలీస్ సహాయకులు వారి పరిధిలో పాఠశాలల తనిఖీలు నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలన్నారు. జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించి జిల్లాలో మొత్తం 1366 పాఠశాలల్లో 1166 పాఠశాలల్లో 95 శాతానికి పైగా విద్యార్ధులు, 145 పాఠశాలల్లో 80-95 శాతం మంది విద్యార్ధులు మధ్యాహ్న భోజనం స్వీకరిస్తున్నారన్నారు. 80 శాతం కంటే తక్కువ తీసుకుంటున్న పాఠశాలలు 55 ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న పోషకాల విలువతో కూడిన మధ్యాహ్న భోజనం నూరు శాతం విద్యార్థులు స్వీకరించేలా చూడాలన్నారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3న ప్రారంభం కానున్న దృష్ట్యా పటిష్టవంతమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించాలని, ప్లైయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. విద్యా హక్కు చట్టం ప్రైవేట్ పాఠశాలల్లో నూరు శాతం అమలు చేయటానికి కృషి చేయాలన్నారు. స్పందన అర్జీల పరిష్కారానికి సంబంధించి ఈనెల 8 నుండి 21 వరకు రీఓపెన్ కేసులు 7 శాతం వచ్చాయన్నారు. దీనిని బాగా తగ్గించి జీరో చేయాలన్నారు. గడువు దాటినవి ఏమీ లేవన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద జిల్లాలో గుర్తించిన 766 పనులకు గాను 736 పనులు మంజూరు చేయగా, వీటిల్లో 668 పనులు గ్రౌండింగ్ అయ్యాయని, మిగతావి సత్వరమే గ్రౌండింగ్ చేయాలన్నారు. జిల్లాలో ఈనెల 27, 28, 29 తేదీలలో ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ కోసం స్పెషల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. 0-6 మధ్య వయస్సు పిల్లలకు తప్పనిసరిగా ఆధార్ నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, డిఎంఅండ్ హెచ్‌ఒ డాక్టర్ గీతాబాయి, డిఇఒ తాహెరా సుల్తానా, ఐసీడీఎస్ పీడీ ఎస్.సువర్ణ, డిఎల్‌డిఒ సుబ్బారావు, సిపిఒ వై.శ్రీలత, డిఆర్‌డిఎ పీడీ పిఎస్‌ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










