25న విజయవాడలో జాతీయ సదస్సు
- జయప్రదం చేయండి : డివైఎఫ్‌ఐ
ప్రజాశక్తి - నంద్యాల
రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగం సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహరిస్తున్న తీరుపై ఈ నెల 25న విజయవాడలోనిమాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో 'నిరుద్యోగం-పరిష్కార మార్గాలు' అంశంపై జాతీయ సదస్సు ఎపి రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఎస్.శివ తెలిపారు. ఈ సదస్సులో ప్రతి ఒక్క నిరుద్యోగి పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మంగళవారం స్థానిక డివైఎఫ్‌ఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందాయన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటు గద్దలయిన అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి హౌదా ఇవ్వకుండా ప్రజల నోట్లో మట్టి కొట్టారన్నారు. విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కుపై చావు కబురు చల్లగా చెప్పినట్టు పార్లమెంటులో సాధ్యం కాదన్నారన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తానని చెప్పి ఇంతవరకు ఏ పోస్టులూ భర్తీ చేయలేదన్నారు. కేవలం వాలంటీర్ల పోస్టులతోనే సరిపెట్టి ఇవే ఉద్యోగాలని యువతను మభ్యపెడుతున్నాడని అన్నారు. ఇంతవరకు ఒక్క డీఎస్సీ, గ్రూప్స్ నోటిఫికేషన్, కొత్త జాబ్ క్యాలెండర్ లేదన్నారు. వదిలిన ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమ్స్ పాసైన వారికి ఇంతవరకు ఈవెంట్స్ నిర్వహించలేదన్నారు. రాష్ట్రంలోని యువత నిరుత్సాహంతో ఉద్యోగాలు రావన్న భ్రమలోకి వచ్చేశారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యపై ఈ నెల 25న విజయవాడలో జరిగే జాతీయ సదస్సుకు డివైఎఫ్‌ఐ అఖిలభారత అధ్యక్షులు రహీం, శాసనమండలి సభ్యులు ఐ.వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. సదస్సు జయప్రదానికి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులు మేధావులు అందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వెంకట చిరు, నాయకులు చక్రి, మార్క్ స్టీవెన్, అఖిల్, సంజరు తదితరులు పాల్గొన్నారు.










