Oct 04,2023 10:56

గ్యాంగ్‌టక్‌ :   సిక్కింలో మెరుపు వరదలు విధ్వంసం సృష్టించాయి. మంగళవారం రాత్రి కురిసిన కుంభవృష్టికి తీస్తానది పొంగిపొర్లడంతో వరద ముంచెత్తింది. ఈ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లైంతనట్లు అధికారులు తెలిపారు. చుంగ్తాంగ్‌ డ్యామ్‌ నుండి నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల నీటి మట్టం అకస్మాత్తుగా 15-20 అడుగుల ఎత్తుకు పెరిగిందని, దీంతో సింగ్టామ్‌ సమీపంలోని బర్దాంగ్‌ వద్ద పార్క్‌ చేసిన ఆర్మీ వాహనం మునిగిపోయిందని అన్నారు. ఆ వాహనంలో 23 ఆర్మీ సిబ్బంది ఉన్నారని, మరికొన్ని వాహనాలు మునిగిపోయినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.  మెరుపు వరదలతో  లాచెన్‌ లోయ వెంబడి ఉన్న కొన్ని సైనిక పోస్టులు  ప్రభావితమైనట్లు  ఈస్ర్టన్  కమాండ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

సిక్కింలో రాత్రంతా భారీ వర్షం కురిసిందని, ఉత్తర సిక్కింలోని లొనాక్‌ సరస్సు ఉప్పొంగటంతో తీస్తానదిలో నీటి మట్టం పెరిగింది. దీంతో ప్రభుత్వం సిక్కింలో హై అలర్ట్‌ ప్రకటించింది. ఈ వరదల్లో ఎవరూ గాయపడలేదని, అయితే భారీగా ఆస్తినష్టం సంభవించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తెలిపారు. సింగ్‌టామ్‌లో కొంతమంది తప్పిపోయారని, సహాయక చర్యలు కొనసాగతున్నాయని అన్నారు.

సిక్కింలోని చుంగ్‌తాంగ్‌లోని సరస్సు పొంగిపొర్లడంతో తీస్తానదిలో నీటి మట్టం పెరిగిందని, దీంతో లోతట్టు ప్రాంతాలైన గజోల్‌డోబా, దోమోహని, మొఖలిగంజ్‌ మరియు ఘిష్‌ ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.