ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
యుటిఎఫ్ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 22న పత్తికొండలో ప్రారంభమయ్యే ప్రచారయాత్రను జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.నాగమణి, జిల్లా అధ్యక్షులు జె.ఎల్లప్ప కోరారు. గురువారం స్థానిక ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. యుటిఎఫ్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి విజయవాడ వరకు ఒకటి, అనంతపురం జిల్లా హిందూపురం నుంచి విజయవాడ వరకు రెండో ప్రచార యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. హిందూపురంలో ప్రారంభమయ్యే ప్రచారయాత్ర 22న జిల్లాలోని పత్తికొండలో ప్రవేశించి కోడుమూరు, కర్నూలులో యాత్ర కొనసాగుతుందని చెప్పారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల అధ్యయనం కోసం ఈ రెండు ప్రచార జాతాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తాయని తెలిపారు. ప్రాథమిక విద్యారంగం బలోపేతానికి మేధావులతో చర్చించి చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయులకు గొడ్డలిపెట్టుగా మారనున్న జిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రచారయాత్రలో ఉపాధ్యాయులు, యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శులు ఎస్.దావీదు, నరసింహులు, దేవపాల్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు కౌలన్న, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్లారి నాగరాజు, మండలాల బాధ్యులు కె.శివకుమార్, చంద్రపాల్, ఎం.రాజు, పెద్దారెడ్డి, కె.లక్ష్మన్న, ఎస్.విజరు కుమార్, వై.రామాంజనేయులు పాల్గొన్నారు. కోసిగి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మికాంతరెడ్డి, విజరు కుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా మండలంలోని అన్ని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు ఎస్.దావీదు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం.నాగరాజు, నాయకులు పెద్దారెడ్డి, లక్ష్మన్న, శంకరయ్య, బి.నాగరాజు, పాలాగి, దానమయ్య, చిన్నవీరన్న, శాంతన్న, అయ్యస్వాములు, అమర్ నాథ్ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి










