Mar 12,2023 23:00

ప్రజాశక్తి-గన్నవరం : మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా నాయకులు పిల్లి మహేష్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం గన్నవరం లోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ మండల స్థాయి సమావేశం కుమారి అధ్యక్షతన జరిగింది. ముందుగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గండికోట సమ్మక్క మాట్లాడుతూ ఎన్నో కష్టాలను, నష్టాలను తట్టుకొని పిల్లలకు ఎంతో రుచిగా ఆహారం పెడుతున్న వంట కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు.కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రతి నెల 5 వ తేది లోపు వేతనాలు చెల్లించాలని, 12 నెలలకు వేతనాలు ఇవ్వాలని, మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని, వంటచేసేటప్పుడు అగ్నిప్రమాదానికి గురైనటువంటి వారికి నష్టపరిహారం చెల్లించాలని, గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చెయ్యాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్‌ 1 ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈనెల 20వ తేదీన విజయవాడలోని అలంకార్‌ సెంటర్‌ వద్ద ధర్నా చౌక్లో జరిగే రాష్ట్ర ధర్నాలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా నాయకులు పిల్లి మహేష్‌ మాట్లా డుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల 54 ప్రభుత్వ పాఠశాలలో 38:44 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఈ పథకంలో 88 వేల మంది వంట కార్మికులు పనిచేస్తున్నారని,గత 20 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుందన్నారు. సామాజిక భద్రత పెన్షన్లు లేవనీ,పనిలో అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు వున్నా ఎలాంటి వైద్య బీమా సౌకర్యం లేదన్నారు. ప్రైమరీ విద్యార్థులకు రూ.5.88 పైసలు, అప్పర్‌ ప్రైమరీ/హైస్కూల్‌ విద్యార్థులకు రూ.8.57 పైసలతో నాణ్యమైనటువంటి పౌష్టికరమైన భోజనం పెట్టడం ఎలా అనేది ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్‌ నాయకులు రూత్‌ కుమారి, పాండురంగమ్మ, సుందరి, సుజాత, మారేశ్వరి పాల్గొన్నారు.