Oct 21,2023 00:44
సమావేశంలో మాట్లాడుతున్న బీసీ సంఘం నాయకులు

ప్రజాశక్తి-గిద్దలూరు: రానున్న ఎన్నికలలో బహుజనులు రాజ్యాధికారం దిశగా కృషి చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్ప్రింగ్‌ బోర్డు స్కూల్‌ ఆవరణలో జరిగిన బీసీల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలకు, ఎస్సి, ఎస్టి, మైనార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ 2024 సాధారణ ఎన్నికల్లో పోటీచేసే విషయమై సన్నాహాలు సాగిస్తున్నామని అన్నారు. గత 70 సంవత్సరాలుగా నూటికి 80 శాతం పైగా ఉన్న బహుజనులకు సరైన ప్రాతినిధ్యం లేదని, అలాగే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వారికి కూడా పెరుగుతున్న జనాభా అనుగుణంగా ప్రాతినిధ్యం లభించడం లేదని, చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేని కారణంగా వారికి కనీసం 25 శాతం కూడా స్థానాలు లభించడం లేదని అన్నారు. రాజ్యాధికారం లేని కారణంగా ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాలన్నింటిలో బహుజనులకు నష్టం జరుగుతోందని అన్నారు. ఆధిపత్య కుల రాజకీయ పార్టీల ద్వారా బహుజనులకు న్యాయం జరగడంలేదన్నారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో సమైక్యాన్ని ఏపీ బీసీ సంక్షేమ సంఘం ద్వారా రాజకీయ పార్టీ ఏర్పరచాలని తామందరం నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాలలో ఇప్పటికే కార్యకర్తలను ఏర్పాటు చేసుకొని నిర్మాణ దిశగా పురోగ మిస్తున్నామని ఆయన తెలిపారు. రాజ్యాధికారం దిశగా కృషి చేస్తున్న ఈ వర్గ ప్రముఖులందరికీ 2024 ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బహుజనులు స్వతంత్య్ర రాజకీయ శక్తిగా రూపొంది ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాడీ వెంకట నారాయణ, కుమ్మరి క్రాంతికుమార్‌, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, కంచర్ల కోటయ్య గౌడ్‌, పందిళ్లపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు.