పుట్టపర్తి అర్బన్ : 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న అమ్మఒడి పథకం కింద 1,60,397 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.208.516 కోట్లను జమ చేసింది. బుధవారం నాడు పుట్టపర్తి కలెక్టర్‌లో జిల్లా స్థాయి అమ్మఒడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.అరుణ్ బాబు, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ ఛైర్మన్ రమణారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఓబులపతి, ఇన్‌ఛార్జి డిఇఒ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మఒడి 4వ విడత సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 1,60,397 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 208.516 కోట్లను జమ చేసిందని చెప్పారు. పేద కుటుంబాల్లోని పిల్లల చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ ఛైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపరేఖలను మారుస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని పేద విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు రూ.208.516 కోట్ల మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు, విద్యార్థులు పాల్గొన్నారు.










