
15న ప్రజారక్షణ భేరికి తరలిరండి
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు
ప్రజాశక్తి -నగరి
ఈనెల 15వ తేదీన జరగనున్న ప్రజారక్షణ భేరి బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపునిచ్చారు. గురువారం నగరి బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రజాసమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి బహిరంగ సభకు ఈనెల 15వ తేదీన చిత్తూరు జిల్లా నుంచి భారీగా కదిలి రావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం భారీ స్థాయిలో ప్రజారక్షణ భేరి పేరుతో సభ నిర్వహిస్తున్నదని, ఈసభకు ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శ సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం ప్రజా ప్రణాళిక విడుదల చేస్తూ పేదలకు కరెంటు యూనిటీ ఒక్క రూపాయికే ఇవ్వాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, గ్యాస్ 400 రూపాయలకు ఇవ్వాలని, పెట్రోల్, డీజిల్ 60 రూపాయలు తేవాలని, అన్ని రకాల పింఛన్లు ఐదువేలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నగిరిలో వేలాదిమంది ఉన్న పవర్ లూం కార్మికులకు గతంలో అగ్రిమెంట్ ప్రకారం కూలి రేట్లు పెంచాలని, నగిరి సభలో సీఎం ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్తు ఉచితంగా ఇవ్వాలని, ఎన్నో సంవత్సరాలగా వారి కుటుంబాలు కష్టపడి పనిచేస్తున్న జీవితాలు మెరుగుపడిన పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోవడానికి హంద్రీనీవా, గాలేరు -నగిరి ప్రాజెక్టు పూర్తి చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వాలని, పాడి రైతులను దోపిడీ చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని వీటి సాధనకై జరిగే ఈ ప్రజారక్షణ భేరి కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం ప్రజాప్రణాళికను ఇంటింటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగిరి సిపిఎం కార్యదర్శి పెరుమాళ్, నాయకులు జగదీష్, షణ్ముగం, మురుగేష్, తిరుమల్, లక్షాధిపతి తదితరులు పాల్గొన్నారు.