ప్రజాశక్తి - దేవనకొండ
కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లోని సర్పంచుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని వెలమకూరు, బేతపల్లి, చెల్లెల చెలిమిల సర్పంచులు భాస్కర్, వెంకటేశ్వర్ రెడ్డి, చిన్న రామప్ప, నేలతలమర్రి ఎంపిటిసి విజయభాస్కర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో ఎంపిపి లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పంచాయతీలకు మంజూరయ్యే నిధులను సైతం వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు దారి మళ్లించిందని తెలిపారు. గ్రామాల్లో వీధిలైట్లు, పారిశుధ్య పనులు, తాగునీటి పంపుల మరమ్మతులు చేయించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపిపి లక్ష్మీదేవి, ఎంపిడిఒ గౌరీ దేవి మాట్లాడుతూ... త్వరలో ఆర్థిక సంఘం నిధులు జమ అవుతాయని తెలిపారు. దేవనకొండ ఎంపిటిసి తపాల శ్రీనివాసులు మాట్లాడుతూ... గ్రామంలో రెండు సచివాలయ భవన నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయని, వాటిని పూర్తి చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆటస్థలం కింద 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరారు. సంబంధిత అధికారులు కలెక్టర్‌కు నివేదికలు పంపాలన్నారు. నేలతలమర్రి ఎంపిటిసి విజయభాస్కర్ గౌడ్, వెలమకూర్ సర్పంచి భాస్కర్ మాట్లాడుతూ... ఈఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు పత్తి విత్తనాలు నాటారని, వర్షాభావ పరిస్థితులతో మొలకలు రాక రైతులు నష్టపోయారని తెలిపారు. గతంలో కరువు కింద ప్రభుత్వాలు ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు పరిహారం అందించేవని, ప్రస్తుత ప్రభుత్వం అరకొరగా పంటల ఇన్స్యూరెన్స్ ఇస్తోందని పేర్కొన్నారు. రైతులందరికీ నష్ట పరిహారం అందడం లేదని, గత ప్రభుత్వాలు మాదిరిగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఎఒ సురేష్ బాబు మాట్లాడుతూ... ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఎంఇఒలు తిమ్మారెడ్డి, విజయలక్ష్మి, ఇఒఆర్‌డి సూర్యనారాయణ, ఎపిఒ కృష్ణమూర్తి, పశువైద్యాధికారి వెంకటేష్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ మురళీ విజరు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచులు










