Jul 25,2023 10:40
  • రాష్ట్రం ప్రతిపాదించింది రూ.17,144 కోట్లు
  • పార్లమెంటులో కేంద్ర మంత్రి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పోలవరం ప్రాజెక్టు తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.12,911 కోట్లు ఇచ్చేందుకు ఆర్థికశాఖలోని వ్యయ విభాగం ఆమోదించినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైసిపి ఎంపి వి విజయసాయిరెడ్డి, టిడిపి రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ పోలవరం ప్రాజెక్టుపై అడిగిన వేర్వేరు ప్రశ్నలకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ కింద చేపట్టిన నిర్మాణాల్లో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రూ.17,144 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇందులో భూసేకరణ కోసం రూ.2,177 కోట్లు, ఆర్‌అండ్‌ఆర్‌ పనుల కోసం రూ.5,217 కోట్లు కలిపి మొత్తం పునరావాసం పనులకు రూ.7,300 కోట్లుగా వుంది. పునరావాసం పనులకు కలిపి రూ.17,144 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రం ప్రతిపాదించిన మొత్తం కాకుండా పునరాస, నిర్మాణ పనులకు గానూ 41.15 మీటర్ల వరకు నీటిని నిలువ చేసేందుకు రూ.10,911.15 కోట్లు, వరదలు కారణంగా దెబ్బతిన్న నిర్మాణాల మరమ్మతుల కోసం మరో రూ.2 వేలకోట్లు విడుదల చేయడానికి ఆర్థికశాఖ అంగీకరించిందని కేంద్ర మంత్రి తెలిపారు. పోలవరం నిధులకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం తాజా ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉందని మంత్రి వివరించారు. పోలవరం తొలిదశ నిర్మాణంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి సవరించిన అంచనాల ప్రకారం రూ.17,144 కోట్లు అవసరం ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత జూన్‌ 5న తమకు ప్రతిపాదనలు సమర్పించిందని తెలిపారు. వీటిని త్వరితగతిన పరిశీలించి ప్రభుత్వ ఆమోదం పొందేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఈ ప్రక్రియ నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కోరడం సబబు కాదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి 2022 మార్చి 15న రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల ప్రాతిపదికన తక్షణం రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి 2022న జులై 15న రాసిన లేఖను కూడా ఆర్థికశాఖ వ్యయ విభాగం పరిగణనలోకి తీసుకున్న పిమ్మటే మొత్తం రూ.12,911 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో తొలిదశ పూర్తికి రాష్ట్రం నుండి రూ.17,144 కోట్లను కోరితే రూ.10,911.15 కోట్లే ఇచ్చినందున పునరావాసం, నిర్మాణం పనులకు వచ్చిన నిధులను నిష్పత్తి ప్రకారం ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకు ంటామని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు తెలిపారు.
 

                                                           ఎపిలో 13 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ (పిఎంఎవైయు) కింద ఆంధ్రప్రదేశ్‌లో మంజూరైన 13,33,606 లక్షల ఇళ్లు ఇంకా నిర్మాణం పూర్తి కాలేదని కేంద్ర పట్టణ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి కౌషల్‌ కిశోర్‌ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు పిఎంఎవైయు కింద 21,32,432 ఇళ్లు మంజూరైతే, అందులో 7,98,826 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 118.90 లక్షల ఇళ్లు మంజూరైతే 75.31 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయి. మిలిగిన 43.59 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు.
 

                                             విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో కార్గో ఆపరేషన్స్‌ నిలిపివేత

విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో డొమెస్టిక్‌ ఎయిర్‌ కార్గో కార్యకలాపాలను నిలిపేసినట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వికె సింగ్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో వైసిపి ఎంపి వి విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌ కార్గో రెగ్యులేటెడ్‌ ఏజెంట్‌ అభ్యర్థన మేరకు అవుట్‌ బౌండ్‌ డొమెస్టిక్‌ ఎయిర్‌ కార్గో కార్యకలాపాలను నిలిపేసినట్లు చెప్పారు. అలాగే అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో కామన్‌ యూజర్‌ డొమెస్టిక్‌ ఎయిర్‌ కార్గో టెర్మినల్‌ (సియుడిసిటి) కార్యకలాపాలను నిలిపివేయాలని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బిసిఎఎస్‌) తీసుకున్న నిర్ణయం కారణంగా విజయవాడ విమానాశ్రమంలో సైతం డొమెస్టిక్‌ ఎయిర్‌ కార్గో కార్యకలాపాలను నిలిపేసినట్లు మంత్రి వివరించారు. విశాఖ విమానాశ్రయం నుంచి మాత్రం అన్ని కార్గో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. డొమెస్టిక్‌ ఎయిర్‌కార్గోను స్వయంగా హ్యాండిల్‌ చేస్తామంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ సంస్థ ముందుకు వచ్చినందున దీనిపై ప్రతిపాదనలను సమర్పించ వలసిందిగా బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ అధికారులను కోరినట్లు మంత్రి తెలిపారు.
 

                                                              'జల్‌జీవన్‌' నిధులను ఎపి వాడుకోలేదు

జల్‌జీవన్‌ మిషన్‌ పథకం అమలులో ఎపి ప్రభుత్వం పనితీరు బాగోలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను వాడుకోలేదని రాజ్యసభలో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. జల్‌జీవన్‌ పథకం అమలులో పనితీరు సరిగ్గా లేని రాష్ట్రాల్లో ఎపి ఒకటని కేంద్ర మంత్రి చెప్పారు. 2021 నుంచి పథకం నిధులను ఎపి ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. ఈ మేరకు బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.