మడకశిర : పట్టణంలోని యాదవ కల్యాణ మండపంలో ఈ నెల 10వ తేదీ నిర్వహించనున్న జిల్లా స్థాయి 'ఘర్ ఘర్ కా చంద్రబాబు హమారా' కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ముస్లిము మైనారిటీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి కోరారు. పట్టణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టిడిపి హయాంలో చంద్రబాబు మైనారిటీల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. 50% సబ్సిడీతో రూ. 2 లక్షల వరకు రుణాలు, నూర్‌బాషా ఫెడరేషన్ ఏర్పాటు, పేద విద్యార్థులకు విదేశీ విద్య, ఇమామ్, మౌజన్లకు గౌరవేతనం పెంపు, దుల్హన్ పథకం ద్వారా రూ. 50వేలు, 300కు పైగా షాదీఖానాల నిర్మాణం, రంజాన్ తోఫా, యువతకు ఉపాధి అవకాశాలు, మసీదులు మరమ్మతులు, తదితర అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షుడు భక్తర్, పట్టణ అధ్యక్షుడు మనోహర్, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, సుబ్బరాయుడు, ఫయాజ్, రహంతుల్లా, మల్లికార్జున, ఫక్రుద్దీన్, హనుమంతేగౌడ, ఐటిడిపి తాలూకా అధ్యక్షుడు కాంతరాజు, లోకేష్, మారెన్న, రవికుమార్ పాల్గొన్నారు.










