Aug 25,2023 23:05

ప్రజాశక్తి కలక్టరేట్‌ ( కష్ణా) : వైద్య విద్యా వ్యాపారానికి ద్వారాలు తెరుస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 107, 108 జీ వో లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏ ఐ ఎస్‌ ఎఫ్‌) ఆధ్వర్యంలో శుక్రవారం కష్ణా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చౌక్‌ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి ఎం. సాయికుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్‌ సీట్ల భర్తీలో విద్యా వ్యాపారానికి తెర లేపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోందని విమర్శించారు. నాడు జగన్మోహన్‌ రెడ్డి నా ఎస్సీ, ఎస్టీ ,బీసీ , మైనారిటీలు అని చెప్పుకుని, వాళ్ల ఓట్లతో అధికారంలోకి వచ్చి నేడు ఆ వర్గాల వారికి ద్రోహం చేస్తున్నరన్నారు. మూడు కేటగిరిలుగా సీట్లను భర్తీ చేసి వాటిలో 50 శాతం సీట్లను సెల్ఫ్‌ ఫైనాన్స్‌, ఎస్‌ఆర్‌ కేటగిరీలకు కేటాయించడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. 25 శాతం మాత్రమే రిజర్వేషన్‌ సీట్లను కేటాయించడం సరికాదన్నారు. మచిలీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో బి కేటగిరి 402 , సీ కేటగిరి 160 సీట్లు కల్పిస్తున్నారు కానీ ఎస్సీ ,ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు 443 మార్కులు సాధించిన అవకాశం కల్పించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు సుధీర్‌, అయ్యప్ప, జగదీష్‌ , ఆర్‌.సాయి,రంజిత్‌ , కే. సాయి తదితరులు పాల్గొన్నారు.