ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఫణి కుమార్ డిమాండ్ చేశారు. 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి అధ్యక్షతన కార్మిక కర్షక భవన్ నందు ఉమ్మడి జిల్లా ఉద్యోగుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఫణి కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని 104 ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ (ఆప్కాస్) లో విలీనం చేయాలని కోరారు. ఉద్యోగులకు పి.ఎఫ్, ఈ.ఎస్.ఐ సౌకర్యం కల్పించాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై వేధింపులు ఆపాలని కోరారు. ఉద్యోగుల సమస్యల కొరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో యూనియన్ నాయకులు యాకూబ్ మాట్లాడుతూ 104 ఉద్యోగుల సమస్యల కొరకు యూనియన్ అనేక ఆందోళనలు చేపట్టిందని తెలియజేశారు రాబోవు కాలంలో 104 ఉద్యోగుల సమస్యల కొరకు ఐక్యమత్యంతో ఉద్యమించాలని కోరారు సి.ఐ.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజిబాబు మాట్లాడుతూ 104 ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు సి.ఐ.టి.యు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కార్మికులకు, ఉద్యోగులకు నష్టదాయకమైన విధానాలు అనుసరిస్తున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యోగులు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వెంకటేశ్వర్లు, పెద్దయ్య, జగదీష్, చంద్రహాస్, తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఉమ్మడి కర్నూలు జిల్లాగా ఉన్న 104 ఉద్యోగుల సంఘం రెండు కమిటీలుగా ఎన్నుకోవడం జరిగింది.
- కర్నూలు జిల్లా కమిటీ
104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా కృష్ణారెడ్డి, కార్యదర్శిగా పెద్దయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెంకటేశ్వర్లు, కోశాధికారిగా చంద్రహాస్, ఉపాధ్యక్షులుగా నాగేష్, మరి కొంతమందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.
- నంద్యాల జిల్లా కమిటీ
104 ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా కమిటీ అధ్యక్షులుగా జగదీష్, కార్యదర్శిగా హుస్సేన్ వలి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రశాంత్ ,కోశాధికారిగా మహేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.










