Jul 03,2023 20:46

వాల్‌ పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు

10, 11న కలెక్టరేట్‌ ఎదుట 36 గంటల ధర్నా
- జయప్రదం చేయాలని వాల్‌ పోస్టర్‌ విడుదల
- సిఐటియు, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌
ప్రజాశక్తి - నంద్యాల

      ఐసిడిఎస్‌ పథకానికి నిధుల కేటాయింపు పెంచాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 10, 11వ తేదీల్లో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద 36 గంటల పాటు ధర్నా నిర్వహిస్తున్నట్లు సిఐటియు, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు తెలిపారు. 36 గంటల ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.ఏసురత్నం, ఎ.నాగరాజు, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నిర్మలమ్మ మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలు, గర్భిణులకు, బాలింతలకు ఉపయోగపడే పథకాన్ని క్రమంగా దూరం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. గర్భిణులకు, పిల్లలకు, బాలింతలకు డబ్బుల కేటాయింపులు పెంచాలని, అంగన్వాడీ విద్యను బలోపేతం చేయాలన్నారు. పిల్లలకు యూనిఫామ్‌, అమ్మఒడి అమలు చేయాలని కోరారు. గర్భిణి, బాలింతలకు ఇస్తున్న రేషన్‌, ఆయిల్‌ ఇతర సరుకుల చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. నాణ్యమైన ఆహారం అరఫరా చేయాలని, ప్రతి నెలా ఒక గ్యాస్‌ సిలిండర్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. సెంటర్లలో వంట చేయటానికి గ్యాస్‌ పొయ్యిలు, వంట పాత్రలు సరఫరా చేయాలని కోరారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు కనీసం వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని తదితర సమస్యలపై ఈ నెల 10, 11వ తేదీలలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిర్వహించే 36 గంటల ధర్నాలో జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం 36 గంటల ధర్నా వాల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి వి.బాల వెంకట్‌, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు డి.నిర్మలమ్మ, వెంకటలక్ష్మి, సునీత శైలజ, నాగలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు, కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.