Jul 22,2023 18:10

ప్రజాశక్తి-పత్తికొండ(కర్నూలు) : సాగుకు సాయం ఎకరాకు 10 వేలు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రామచంద్రయ్య, సిపిఎం నాయకుడు దస్తగిరి డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి పెద్ద ఈరన్న అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ, సిపిఎం, టిడిపి, కాంగ్రెస్‌, లోక్‌ సత్తా, జనసేన పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రామచంద్రయ్య, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బత్తిన వెంకటరాముడు,టిడిపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్‌ చౌదరి, లోక్‌ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆనందచారిలు మాట్లాడుతూ.. డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయాలని, దేశానికి అన్నం అందించే అన్నదాత రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెలన్నర పూర్తి కావస్తున్న ఇంతవరకు వర్షం జాడ లేదని, రైతులు పంటలు సాగు చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్రం తరహాలో మన రాష్ట్రంలో కూడా ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వాలని, రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు గ్యారెంటీ యాక్ట్‌ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 50% నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించాలన్నారు. జిల్లాలో పెండింగ్‌ లో ఉన్న ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్‌, కారుమంచి, టిడిపి రామానాయుడు, సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు గురుదాస్‌, తిమ్మయ్య, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంగం జిల్లా సహాయ కార్యదర్శి రాజసాహెబ్‌,ఏపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు కారన్న, జనసేన పార్టీ నాయకులు రాజశేఖర్‌, సిపిఎం నాయకులు దస్తగిరి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నాగార్జున, సిపిఐ ప్రజాసంఘాల నాయకులు నెట్టికంటయ్య, పెద్దయ్య,మాదన్న, తదితరులు పాల్గొన్నారు.