1 నుండి ఇంటి వద్దకే సరుకులు
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మల
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ, బాలింతలకు అందించే బియ్యం, కందిపప్పు వంటి నిత్యావసర సరుకులు జులై 1 నుండి వైఎస్‌ఆర్ కిట్టు పేరుతో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వనున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మల తెలిపారు. శనివారం ఆమెను కలిసిన ప్రజాశక్తితో మాట్లాడుతూ నిత్యావసర సరుకులు 3 కేజీలు బియ్యం, కేజీ కంది పప్పు, ఆయిల్ 500 ఎంఎల్, 2 కేజిలు రాగి పిండి, 1 కేజి అటుకులు, పావు కేజీ బెల్లం, పావు కేజీ ఖర్జురాలు, పావు కేజీ చిక్కీలు ఫేస్ 1లో 13 ఎగ్స్, 2.5 లీటర్లు పాలు, రెండవ ఫేస్‌లో 12 ఎగ్స్, 2.5 లీటర్లు పాలు కిట్టు రూపంలో అందిచనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాల్లోనే వచ్చి భోజనం చేసి వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు. జులై 1 నుండి ఇంటి వద్దకే సరుకులు అందిస్తామన్నారు. గతంలో జొన్న పిండి కూడా ఇచ్చే వారమని, అయితే అందుకు బదులుగా కేజీ రాగి పిండితో పాటు అదనంగా మరో కేజీ రాగి పిండి ప్రభుత్వం నేరుగా ఇస్తుందన్నారు. ఈ ఏడాది వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్‌ను ఆత్మకూరు, శ్రీశైలం, కొత్తపల్లి మండలాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ పోషణ ద్వారా రక్త హీనత కలిగిన గర్భిణీ, బాలింతల్లో వాటిని నివారించడం, అలాగే పోషక విలువలు పెంపొందించనున్నట్లు చెప్పారు. మాతాశిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందన్నారు. జిల్లాలో 1,663 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం ద్వారా 6 సంవత్సరాలలోపు పిల్లలకు రోజుకు రూ.8, తక్కువ బరువు ఉన్న పిల్లలకు రూ.12, గర్భిణీలకు, బాలింతలకు రూ.9 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వెల్లడించారు.










