Nov 07,2023 08:27

దోషులను శిక్షించాలి : వి శ్రీనివాసరావు డిమాండ్‌
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి:పోలవరం ప్రాజెక్టు నాణ్యత, నిర్మాణంలో అవకతవకలపై న్యాయ విచారణ చేసి దోషులను శిక్షించాలని, సంబంధిత బాధ్యుల నుంచి డబ్బులు రికవరీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. సిపిఎం చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర సోమవారం ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నాణ్యతపై అనేక అనుమానాలు నెలకొన్నాయని తెలిపారు. కాఫర్‌ డ్యామ్‌తోపాటు పలుచోట్ల ఇబ్బందులు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని తెలిపారు. టిడిపి, వైసిపి ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏదైనా తేడా వస్తే వందల గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. గత 30న సీతంపేటలో ప్రారంభమైన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర ప్రస్తుతం ఏలూరు జిల్లా ఏజెన్సీలో కొనసాగుతోందన్నారు. గిరిజన ప్రాంతంలో అభివృద్ధి శూన్యంగా ఉందని, రోడ్లు, పాఠశాల భవనాలు సరిగా లేవని, ఆస్పత్రిలో సిబ్బంది లేరని, తాగునీరు లేక గిరిజనులు అల్లాడుతున్నారని తెలిపారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వడం లేదని, ఇచ్చినవి తీసేసుకుంటున్నారని చెప్పారు. ఎక్కడా గ్రామసభలు నిర్వహించడం లేదన్నారు. జీలుగుమిల్లిలో ఆయుధ కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి గ్రామసభలకు సమాచారం లేదని తెలిపారు. అదానీకి ఆయుధ కర్మాగారం పేరిట 1,200 ఎకరాల గిరిజనుల భూములు తీసుకోవాలని చూస్తున్నారని అన్నారు. దీనిపై ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ ఆలోచన వెంటనే విరమించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, బుట్టాయగూడెం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ పాల్గొన్నారు.