పూర్తిస్థాయిలో తాగునీటిని సరఫరా చేయాలి
కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
ప్రణాళిక బద్ధంగా నిర్ణీత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, డిఆర్‌ఒ, జిల్లా అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ ప్రభుత్వ పథకాల పురోగతిపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలో 10 మండలాల్లో వైఎస్సార్ జగనన్న గృహాల నిర్మాణంలో వెనుకబడి ఉన్నాయన్నారు. ఆయా మండలాల్లో పురోగతి సాధించేందుకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, గృహ నిర్మాణ సంస్థ అధికారులు బాధ్యత వహించి సంయుక్త కలెక్టర్తో సమన్వయం చేసుకొని వాటిని అధిగమించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తక్కువ పురోగతి ఉన్న మండలాలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా పర్యటించి అక్కడి స్థితిగతులను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేయాలన్నారు. జగనన్న లేఔట్లలో నీరు, విద్యుత్తు, రహదారులు సిమెంటు, ఇసుక, ఇనుము తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. గృహ లబ్ధిదారులైన మహిళలకు బ్యాంకు రుణాలను సకాలంలో అందజేసేందుకు అన్ని విధాలా కృషి చేయాలన్నారు. వారిలో విశ్వాసం నింపి వారు గృహాలు నిర్మించుకునేందుకు వీలుగా ప్రోత్సహించాలన్నారు. టిడ్కో గహాలు వచ్చే నెలలోగా పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి కావాలన్నారు. వాటికి సంబంధించి విద్యుత్తు, ఆర్థిక పరమైన సమస్యలను అధిగమించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.
రహదారులు, నీరు తదితర మౌలిక వసతులు సమకూర్చేందుకు సంబంధిత ఎంపీడీవోలు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాలో రీ సర్వే చేసిన గ్రామాల్లో సరిహద్దు రాళ్లను నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తిగా ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి పారిశుధ్యం మెరుగుదలకు ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. మచిలీపట్నం నగరానికి ఓడరేవు సంబంధంగా చాలామంది ప్రజలు వస్తుంటారని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. అన్ని రహదారులు చెత్తాచెదారాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, ఆక్రమణలు తొలగించాలని, మురికి కాలువలు పూడిక తీసివేయాలని సూచించారు. రహదారులకు అడ్డంగా ఎక్కడ బడితే అక్కడ ఇసుక, రాళ్లు ఉంచకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సరఫరా చేయాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, పలువురు జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.










