- ఎసిసి ఎమర్జింగ్ ఆసియాకప్
- మధ్యాహ్నం 2.00గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
కొలంబో: ఎసిసి ఎమర్జింగ్ ఆసియాకప్‌లో యువ క్రికెటర్లతో కూడిన భారత్-ఎ జట్టు నేడు పాకిస్తాన్‌తో కీలక పోరులో తలపడనుంది. గ్రూప్-బిలో ఉన్న భారత్-ఏ, పాకిస్తాన్-ఎ జట్లు రెండేసి విజయాలతో ఇప్పటికే సెమీస్‌కు చేరాయి. సెమీస్‌కు చేరే క్రమంలో ఈ రెండుజట్లు భారీ వ్యత్యాసంతో ప్రత్యర్ధి జట్లను చిత్తుచేయడమే ఇందుకు ప్రధాన కారణం. భారత్-ఎ జట్టు తొలి మ్యాచ్‌లో యుఏఇపై 8వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో నేపాల్‌పై 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై 4వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో యుఏఇపై 184పరుగుల తేడాతో గెలిచి ఆ జట్టూ దుర్బేద్యఫామ్‌లోనే ఉంది. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. భారతజట్టు కెప్టెన్ యశ్ ధుల్ తొలి మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. రెండో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 69బంతుల్లోనే 87పరుగులు చేసి తానేమీ తక్కువ కాదంటూ నిరూపించుకున్నాడు. అలాగే సాయి సుదర్శన్(58నాటౌట్) అర్ధసెంచరీతో మెరిసాడు. ఇక బౌలింగ్‌లో నిషాంత్ సంధు(4/14), నేపాల్‌పై బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు. గ్రూప్-బిలో ఇరుజట్లు 4పాయింట్లతో సమంగా ఉన్నా.. భారతజట్టు (+3.79) నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో, పాకిస్తాన్(+2.87) రన్‌రేట్‌తో 2వ స్థానంలో ఉన్నాయి.

- సెమీస్‌కు శ్రీలంక-ఎ, బంగ్లాదేశ్-ఎ జట్లు
గ్రూప్-ఎ నుంచి సెమీస్‌కు బంగ్లాదేశ్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ప్రవేశించాయి. మంగళవారం జరిగిన ఆఖరి గ్రూప్‌లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్-ఎ జట్లు 21పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్-ఎపై, శ్రీలంక-ఎ జట్లు 217పరుగుల తేడాతో ఓమన్-ఎ జట్టుపై గెలిచాయి. గ్రూప్ లీగ్ దశ ముగిసిన అనంతరం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు 4పాయింట్లతో సమంగా ఉన్నా.. శ్రీలంక(+1.69), బంగ్లాదేశ్(+1.26), ఆఫ్ఘనిస్తాన్(+0.41)రన్‌రేట్‌తో టాప్-3లో నిలిచాయి. దీంతో మెరుగైన రన్‌రేట్‌తో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీస్‌కు చేరాయి. శుక్రవారం(21న) సెమీఫైనల్ పోటీలు జరగనున్నాయి.










