Sep 05,2023 23:53

కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

         అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం నగారాన్ని అభివృద్ధి చేసి, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, పాలకవర్గం పూర్తిగా విఫలం అయ్యిందని సిపిఎం నాయకులు విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, రెండు బ్రిడ్జీలను కట్టి అదే నగరాభివృద్ధి అనేలా వ్యవహరించడం సరికాదన్నారు. అనంతపురంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మంగళవారం నాడు ధర్నా నిర్వహించారు. కార్పొరేషన్‌ కార్యాలయం గేట్లను మూసి ఉద్యోగులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వర్షాన్ని సైతం లెక్కజేయకుండా దాదాపు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శిలు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు మాట్లాడుతూ నగరంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, పాలకులు వైఫల్యం చెందారన్నారు. శివారు ప్రాంతాల్లో అనేక సమస్యలతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమస్యల పరిష్కారంలో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. అనంతపురం నగరం నడిబొడ్డులో ఉన్న సెంట్రల్‌ పార్కు స్థలం ఆక్రమణను కాపాడలేని పరిస్థితి ఉందంటే ఇక్కడ పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, ప్రజలపై పన్నుల భారాలు మాత్రం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం మొత్తం అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏర్పాటు చేయాలన్నారు. నగర విస్తీర్ణంకు అనుగునంగా పారిశుధ్య కార్మికులను పెంచాలని సూచించారు. తిక్కరంగయ్య స్వామి గుడి నుంచి తపోవనం దారిని వెడల్పు చేసి బాగు చేయాలన్నారు. రిషిత స్కూల్‌ దగ్గర బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న నడిమి వంక సేఫ్టీ వాల్‌ నిర్మించి వరదల నుంచి కాపాడాలన్నారు. నడిమివంక, మరువవంక, పెద్దవంక పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. టిడ్కో ఇళ్లు వెంటనే లబ్ధిదారులకు అందజేయాలన్నారు. వీటితో పాటు రోడ్లు, ఇతర ప్రజా సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని కోరారు. ఆందోళనకారుల వద్దకు కమిషనర్‌ వచ్చి మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు వి.సావిత్రి, సిపిఎం జిల్లా నాయకులు వెంకటనారాయణ, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రకాష్‌, ముత్తుజ, వలీ, గోపాల్‌, బాలకష్ణ, నగర నాయకులు మసూద్‌, ప్రసాద్‌, రాజు, గఫూర్‌, ఎన్టీఆర్‌ శీన తదితరులు పాల్గొన్నారు.