ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : జిల్లాలో గంజాయి, మత్తుపదార్ధాల వినియోగం, విక్రయాలు, రవాణాను అరికట్టడానికి ఆయా శాఖలు సమన్వయంతో కషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది.జిల్లాలో మాదకద్రవ్యాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులుగా కాకుండా తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆలోచించాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను తెలియజేయాలన్నారు. విద్యార్థులు మత్తుపదార్థాల బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలలు వద్ద అవగాహనా కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిణిని ఆదేశించారు. విద్యార్థులకు ఏఏ రోజుల్లో ఎలాంటి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదీ నివేదికను తయారుచేసి సమర్పించా లన్నారు. మాదకద్రవ్యాల మూల సరఫరా రవాణాను గుర్తించేం దుకు తెలివిగా వ్యవహరించాలని, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వర్కర్లను లక్ష్యంగా చేసుకుని సరఫరా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తూ గట్టి నిఘా ఉంచి విక్రయాలు జరిగే ప్రాంతాలను గుర్తించాలని, మాదకద్రవ్యాల బారిన పడిన బాధితుల పట్ల సున్నితంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు, రవాణా వంటి వాటికి పాల్పడితే వారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైక్యోటోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, 1985 ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, బందరు, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ల అధికారులు ఐ.కిషోర్, విజరు కుమార్, జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డా. జి. గీతాబాయి, జిల్లా అటవీశాఖాధికారి కె.రాజేశేఖరరావు, డ్రగ్స్ నియంత్రణాధికారిణి ఎం. అరుణ పాల్గొన్నారు.










