Sep 21,2023 21:01

సచివాలయ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న రైతుసంఘం నాయకులు

          ప్రజాశక్తి-శింగనమల   బ్యాంకుల్లో రైతు తీసుకున్న రుణాలను మాఫీ చేయడంతోపాటు కరువు సహాయక చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయక కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఎపి రైతుసంఘం, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుసంఘాల ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ సచివాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అనంతను కరువు జిల్లాగా ప్రకటించాలన్నారు. ముఖ్యంగా శింగనమల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పంట రుణాలు మాఫీ చేయాలని, పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు కనీసం ఎకరాకు రూ.50వేలు, విత్తనం వేయని రైతులకు ఎకరాకు రూ.30వేలు, హెచ్‌ఎల్‌సి 5వ డిస్ట్రిబ్యూటరీ బైపాస్‌ కెనాల్‌ పనులు పూర్తి చేసి సలకం చెరువు వరకూ సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే వ్యవసాయ కార్మికులకు జీవనోపాధి నిమిత్తం ప్రతి కుటుంబానికీ రూ.25వేల ఆర్థికసాయం, ఉపాధి హామీ పథకంలో అదనంగా 100 రోజులు పనులు పెంచాలని, పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, కౌలు రైతులకు కౌలు రద్దు చేసి నష్టపరిహారం ఇవ్వాలని, ప్రయివేట్‌ బీమా కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని ప్రభుత్వం రంగంలోని బీమా కొనసాగించాలని, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ సరఫరా ఇవ్వాలని, స్మార్ట్‌ మీటర్లను బిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాచేపల్లి వద్ద ఉన్న లిడ్‌క్యాప్‌ చెప్పుల పరిశ్రమ ఓపెన్‌ చేసి శిక్షణ పొందిన వారికి ఉపాధి చూపించాలని, కొత్తవారికి ట్రైనింగ్‌ ఇవ్వాలని, శ్మశానం లేని గ్రామాలకు స్థలం కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుంకన్న, జయరాముడు, ఎర్రిస్వామి, ఆంజనేయులు, సూర్యప్రకాష్‌, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, కుళ్లాయిస్వామి, వెంకటేష్‌ పాల్గొన్నారు.