Oct 21,2023 11:33

హైదరాబాద్‌ : అర్థరాత్రి సినిమాకొచ్చిన ప్రేక్షకులంతా ఒక్కసారిగా బయటికొచ్చి తమ డబ్బులను తమకు ఇచ్చేయాలని థియేటర్‌ యాజమాన్యంతో గొడవపడిన ఘటన శుక్రవారం జరిగింది. టైగర్‌ష్రాఫ్‌ నటించిన గణపత్‌ మూవీ కోసం నిన్న అర్థరాత్రి 11.15 గంటలకు చివరి షో నడుస్తుండగా సినీ హాలులో భరించలేని దుర్వాసన రావడంతో ప్రేక్షకులు అసౌకర్యానికి గురయ్యారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో థియేటర్‌ సిబ్బంది అప్రమత్తమై స్ప్రే చేస్తామని చెప్పారు. అరగంట అయినప్పటికీ అలాగే దుర్వాసన వస్తుండటంతో ప్రేక్షకుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందరూ బయటికి వచ్చేసి తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తూ థియేటర్‌ సిబ్బందితో గొడవపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ప్రేక్షకులకు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించడంతో పరిస్థితి సద్దుమణిగింది.