Oct 22,2023 21:40

ప్రజాశక్తి-బాపట్ల :రాష్ట్రంలో ప్రతి కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో విశ్రాంత ఐఎఎస్‌ అధికారి, కీర్తిశేషులు ఎస్‌ఆర్‌ శంకరన్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు కోరారు. ప్రజలకు ఆయన అందించిన సేవలు భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. శంకరన్‌ జయంతి సందర్భంగా ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల కలెక్టరేట్‌ వద్ద ఆదివారం శంకరన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఐఎఎస్‌ వ్యవస్థను మానవీయం చేసిన అధికారి శంకరన్‌ అన్నారు. నిరుపేదల కలెక్టర్‌గా ఆయన ఖ్యాతికెక్కారని వివరించారు. నిరుపేదల ప్రయోజనం కోసం 120 జిఒలు జారీ చేశారన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల ఏర్పాటుకు ఆయన ఎంతగానో కృషి చేశారని తెలిపారు. వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులకు శంకరన్‌ జీవితంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు మెడల్స్‌ను జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణతో కలిసి లక్ష్మణరావు అందజేశారు. కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం గేయానంద్‌, జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామారావు, ఫోరమ్‌ కార్యదర్శి డాక్టర్‌ పిసి సాయిబాబు, వెలగా శివరామయ్య, జివి రాజారావు, సిపిఐ నాయకులు శ్రీధర్‌, సిపిఎం నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.