ఢిల్లీ: అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం భారత ఆర్మీ ' ప్రాజెక్ట్ నమన్ 'ను ప్రారంభించింది. మాజీ సైనికులు, సైన్యంలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల కుటుంబాల సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటగా ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఈ తరహా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
భారతీయ సైన్యానికి చెందిన డైరెక్టర్ ఆఫ్ ఇండియా ఆర్మీ వెటర్నన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లిమిటెడ్, సి.ఎస్.ఇ.ఇ. - గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ దీనికోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఇందులో సైనిక కుటుంబాలకు సౌకర్యాలు కల్పించడానికి ఒక కామన్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. అంతేకాకుండా ఇది అన్ని ప్రభుత్వ కస్టమర్ సేవలను అందజేస్తుంది. అందులో సైనికుల కుటుంబాల పెన్షనర్ల ఖాతాలను కూడా నమోదు చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ రెండో దశలో దేశమంతటా వివిధ సైనిక స్టేషన్లలో మరో 13 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలోనూ ఈ ప్రాజెక్ట్ నమన్ నుంచి ఆర్మీ.. అమరుల కుటుంబాల కోసం పలు సేవా కార్యక్రమాలను అందించింది.










