Jul 15,2023 10:26

వెస్టిండీస్‌ పర్యటనలో భారత జట్టు, తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 150 పరుగులకి ఆలౌట్‌ కాగా.. తొలిటెస్ట్‌లో అరంగేట్రం యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(171) భారీ శతకానికి తోడు, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (102), మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(76) అర్ధసెంచరీలతో మెరిసాడు. దీంతో భారతజట్టు మూడోరోజు 5వికెట్ల నష్టానికి 421పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. లంచ్‌ సమయానికి 4వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసిన టీమిండియా.. ఆ తర్వాత విరాట్‌ కోహ్లి ఔటయ్యాక రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేశాడు. ఆ సమయానికి క్రీజ్‌లో జడేజా(37) ఇషాన్‌ కిషన్‌(1) ఉన్నారు. దీంతో భారతజట్టుకు 271పరుగుల ఆధిక్యత లభించింది. వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 50.3 ఓవర్లు బ్యాటింగ్‌ చేసి, 130 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో టీమిండియాకి ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది.
విండిస్‌ బ్యాటర్లలలో టగెనరైన చంద్రపాల్‌ (7), క్రెగ్‌ బ్రాత్‌వైట్‌ (7), జర్మెన్‌ బ్లాక్‌వుడ్‌ (5), రేమన్‌ రిఫర్‌ (11), జోషువా డి సిల్వ (13), అలిక్‌ అథనజే (28), అల్జెరీ జోసఫ్‌ (13), రహ్కీమ్‌ కార్న్‌వాల్‌ (4) , కీమర్‌ రోచ్‌(0), జోమేల్‌ వర్రీకాన్‌ (18) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రవిచంద్రన్‌ అశ్విన్‌, రెండో ఇన్నింగ్స్‌లోనూ 7 వికెట్ల ప్రదర్శన నమోదుచేశాడు. జడేజా (2), సిరాజ్‌ (1) తీసుకున్నారు.