ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ (కృష్ణా) : రాష్ట్ర వైద్య మౌలికవసతుల అభివద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.మురళీధర్ రెడ్డి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య నానిలతో కలిసి బుధవారం స్థానిక మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండి డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ.. కళాశాల పనులను జూన్ ఆఖరికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. మెడికల్ కళాశాలలో ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభించడానికి హాస్టల్ భవనాలు, ల్యాబ్స్ భవనాలు షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి సరఫరా కోసం 8.8 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి అన్నారు. 150 మంది విద్యార్థులకు హాస్టల్ వసతికి నిర్మిస్తున్న భవనాలలో వసతి సౌకర్యాలతో పాటు తాగునీటి సౌకర్యానికి పైప్ లైన్ కనెక్షన్లు వంటి పనులు పూర్తి చేయాలన్నారు. హౌస్ కీపింగ్ సంబంధించి ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా పనులు, ఇంటర్నెట్ సౌకర్యం, సీసీ కెమెరాలు ఏర్పాటు, ఆడియో వీడియో సిస్టం ఏర్పాటు పనులు, అంబులెన్స్‌లు, ల్యాబ్స్ లో పరికరాలు ఏర్పాటు, ఏసీ సౌకర్యం పనులు ఎంతవరకు వచ్చాయి ఆరా తీశారు. మైక్రోబయాలజీ వంటి నాలుగు విభాగాలకు నాలుగు లేబరేటరీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శానిటేషన్, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని పెస్ట్ కంట్రోల్ చర్యలు తీసుకోవాలన్నారు.వాహనాల పార్కింగ్ సంబంధించి పక్కాగా పై కప్పుతో ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాలంలోగా డ్రైనేజీ నిర్మాణ పనులు, అప్రోచ్ రోడ్లు అప్రోచ్ రోడ్లు పూర్తి చేయాలని అన్నారు. హాస్టల్లో ఫర్నిచర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విండోలకు మస్కిటో నెట్లు, హ్యాంగర్స్ ఏర్పాటు చేయాలనీ, వైద్య పరికరాలు కళాశాలకు పంపామని, అవి తీసుకుని స్టాక్ ఎంట్రీలు పక్కాగా నమోదు చేయడంతో పాటు స్టోర్ ఇన్చార్జ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. జూలై నుండి ఇన్స్టాలేషన్ పనులు మొదలు పెట్టాలన్నారు. వచ్చేవారం ముఖ్యమంత్రి సమీక్షిస్తారని అప్పటికల్లా పనులన్నీ కొలిక్కి రావాలన్నారు. ప్రిన్సిపాల్ ,వైస్ ప్రిన్సిపాల్ ఇక్కడకు వచ్చి కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించారు. గర్ల్స్ హాస్టల్ కాంపౌండ్ వాల్ పూర్తి చేయాలని అన్నారు అడ్మిషన్లు ముందు పిల్లలు వారి తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి వసతులు చూసుకుంటారని, వారిలో సానుకూల దక్పథం కలిగేలా పనులన్నీ సకాలంలో పూర్తిచేసి ఇతర కళాశాలలకు మోడల్ గా తీర్చిదిద్దాలని ఎండి సూచించారు. కేవలం ప్రధాన భవనాలు నిర్మాణం పూర్తి చేస్తే అంతా అయిపోయినట్లు కాదని, వసతుల కల్పన ముఖ్యమని గుర్తుంచుకోవాలన్నారు. స్థానిక సర్వజన ఆసుపత్రిలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆసుపత్రిలో రెండు లిఫ్టులు మరమ్మత్తులు అవసరమని, కాన్ఫరెన్స్ హాల్ అవసరమైన మరమ్మత్తులు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందని ఆసుపత్రి సూపర్డెంట్ తెలుపగా, అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపాలనీ సూపర్నెంట్ ను ఆదేశించారు. రెండు బస్సులు ఏర్పాటు చేయాలని తెలుపగా వాటి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ సూపర్నెంట్ ఇంజనీర్ బలరాం రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.రవీంద్రబాబు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి, వైస్ ప్రిన్సిపాల్ ఆశాలత, మేఘ ప్రతినిధులు కృష్ణారెడ్డి, జగదీష్ పాల్గొన్నారు.










