Sep 17,2023 09:25

ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు నెలల్లో 179 మంది చిన్నారులు మరణించారు. వైద్యాధికారులతోపాటు స్థానిక నేతలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలోని నందుర్‌బార్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో గత మూడు నెలల్లో 179 మంది చిన్నారులు చనిపోయారు. జూలైలో 75 మంది పిల్లల మరణాలు నమోదయ్యాయి. ఆగస్టులో ఈ సంఖ్య 86కు పెరిగింది. సెప్టెంబర్‌లో ఇప్పటి వరకు 18 మంది చిన్నారులు చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం, సరైన వసతులు లేకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే అంశా పాద్వీ మండిపడ్డారు. సరిపడా వనరులు లేకపోవడం, వైద్య సిబ్బంది కొరత కారణంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బాలింతలు, నవజాత శిశువుల జీవితాలతో రాష్ట్రప్రభుత్వం చెలగాటమాడుతున్నదని విమర్శించారు. సుమారు 200కు చేరిన చిన్నారుల మరణాలపై వైద్యాధికారులు వివరణ ఇచ్చారు. 80 శాతం మరణాలు 0-28 రోజుల వయసున్న శిశువులవేనని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఎం సావన్‌ కుమార్‌ తెలిపారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో అత్యధిక పోషకాహార లోపం ఉందని చెప్పారు. నెలలు నిండకుండానే పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం, పాముకాట్లు, ప్రసవ సమయంలో సెప్సిస్‌, శ్వాసకోశ వ్యాధులు, ఇంటి వద్ద ప్రసవాలు, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి అనేక కారణాలున్నాయని చెప్పారు. చిన్నారుల మరణాలను తగ్గించేందుకు 84 రోజుల లక్ష్యం పేరుతో ఒక మిషన్‌ చేపట్టినట్లు సావన్‌ కుమార్‌ తెలిపారు.